మేమే చంపాం.. వచ్చి అరెస్టు చేయండి

బల్లార్ష, న్యూస్‌టుడే : మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా బల్లార్‌పూర్‌ పట్టణంలో సూరజ్‌ బహురియా(30) అనే యువకునిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి మేమే చంపాం.. వచ్చి అరెస్టు చేయండని సమాచారం సైతం ఇచ్చారు. ఈ ఘటన శనివారం బల్లార్‌పూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రధాన రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో బొగ్గు వ్యాపారం చేస్తున్న సూరజ్‌ బహురియా తన కారులో బామినీ వైపు వెళుతూ పాత బస్టాండ్‌ వద్ద ఓ హోటల్‌ ఎదుట ఆగాడు. అంతలో వెనుకనుంచి ఇద్దరు దుండగులు వచ్చి డ్రైవర్‌ సీటులో కూర్చున్న బహురియాను కారుగ్లాసు తీయమని కోరారు. గ్లాసు తీయకపోవడంతో దుండగులు తుపాకీతో కారు గ్లాసుపై కాల్పులు జరిపారు. అదే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అతని తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు అతడిని చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు తమ ద్విచక్ర వాహనంపై బీటీఎస్‌ చౌక్‌కు చేరుకొని మేమే కాల్చి చంపాం. ఇక్కడే ఉన్నాం. వచ్చి అరెస్టు చేయండని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న సూరజ్‌ అనుచరులు పోలీస్‌ స్టేషన్‌ కూడలిలో గుమికూడి దుండగులను అప్పగించాలని ఆందోళన చేశారు. పోలీసులు వారందరిని చెదరగొట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలో జరిగిన కాల్పుల ఘటనతో బల్లార్‌పూర్‌ పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సూరజ్‌ పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బ్యానర్లు కట్టారు. పాత కక్షలతోనే సూరజ్‌ను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఉపవిభాగీయ అధికారి జాదవ్‌, ఠాణేదార్‌ భగత్‌ సందర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి సందర్శించి వివరాలపై ఆరా తీశారు.

Read Full Article Here

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *